పుట:తాళ్ళపాక పదసాహిత్యం - రెండవ భాగం.pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0107-06 లలిత సం: 02-042 వైరాగ్య చింత

పల్లవి: తుద సమస్తమును దుర్లభమే
అదె సులభుఁడు మాహరి యొకఁడే
    
చ. 1: సురలును నరులును సొంపగు సిరులును
వొరసిన నిన్నియు నుపాధులే
నిరుపాధికుఁడును నిజకరుణానిధి
అరయఁగ నిదె మాహరి యొకఁడే
    
చ. 2: అందరియీవులు నఖిలకర్మములు
అందఁగరాని ప్రయాసములే
యిందిరారమణి నేచిన సేవిది
చెందరు సుజనులు చెప్పంగలదె
    
చ. 3: యితరోపాయము లేవి చూచినా
శ్రుతివిరహితములు శూన్యములే
రతి శ్రీవేంకటరమణునిమతి యిది
హితపరిపూర్ణం బిది యొకటే