పుట:తాళ్ళపాక పదసాహిత్యం - రెండవ భాగం.pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0107-05 బౌళి సం: 02-041 అంత్యప్రాస

పల్లవి: అతిసులభం బిదె శ్రీపతిశరణము అందుకు నారదాదులె సాక్షి
ప్రతిలే దిదియే నిత్యానందము బహువేదంబులె యివే సాక్షి
    
చ. 1: వేసరకుమీ జీవుఁడా వెదకివెదకి దైవమును
ఆసపాటుగా హరి యున్నాఁడిదె అందుకుఁ బ్రహ్లాదుఁడే సాక్షి
మోసపోకుమీ జన్మమా ముంచిన యనుమానములను
సేసినభక్తికిఁ జేటు లేదు యీసేఁతకెల్ల ధ్రువుఁడే సాక్షి
    
చ. 2: తమకించకుమీ దేహమా తగుసుఖదుఃఖంబుల నలసి
అమితము నరహరికరుణ నమ్మితే నందుకు నర్జునుఁడే సాక్షి
భ్రమయకుమీ వివేకమా బహుకాలంబులు యీఁదీఁది
తమితో దాస్యము తను రక్షించును దానికి బలీంద్రుఁడే సాక్షి
    
చ. 3: మరిగివుండుమీ వోజిహ్వా మరి శ్రీవేంకటపతినుతులు
అరయఁగ నిదియే యీడేరించును అందుకు వ్యాసాదులే సాక్షి
తిరుగకుమీ విజ్ఞానమా ద్రిష్టపుమాయలకును లోఁగి
సరిలే దితనిపాదసేవకును సనకాదులబ్రదుకే సాక్షి