పుట:తాళ్ళపాక పదసాహిత్యం - రెండవ భాగం.pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0108-02 ధన్నాసి సం: 02-044 హరిదాసులు

పల్లవి: హరిదాసులతోడ నల్పులు సరెనరాదు
గురుఁడు శిష్యుడుననే గుఱి దప్పుఁగానా
    
చ. 1: కోరి ముత్యపుఁజిప్పలఁ గురిసిన వానయు
సారెఁ బెంకులలో వాన సరియౌనా
శ్రీరమణుఁ డిన్నిటానుఁ జేరియుంటేనుండెఁ గాక
సారెకుఁ బాత్రాపాత్రసంగతింతా లేదా
    
చ. 2: మలయాద్రి మాఁకులును మహిమీఁది మాఁకులును
చలమున నెంచిచూడ సరియౌనా
అలరి దేవుఁడు అంతర్యామియైతేనాయఁ గాక
తెలియఁగ క్షేత్రవాసి దిక్కులందు లేదా
    
చ. 3: అమరుల జన్మములు నసురల జన్మములు
జమళిఁ బుట్టినంతలో సరియౌనా
అమరి శ్రీవేంకటేశుఁ డాతుమైతేనాయఁ గాక
తమితో నధికారిభేదములు లేవా