పుట:తాళ్ళపాక పదసాహిత్యం - రెండవ భాగం.pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0107-01 సాళంగనాట సం: 02-037 ఉపమానములు

పల్లవి: ఆమీఁది నిజసుఖ మరయలేము
పామరపు చాయలకే భ్రమసితిమయ్యా
    
చ. 1: మనసునఁ బాలు దాగి మదియించి వున్నట్టు
ననిచి గిలిగింతకు నవ్వినయట్టు
యెనసి సంసారసుఖ మిది నిజము సేసుక
తనివొంది యిందులోనే తడఁబడేమయ్యా
    
చ. 2: బొమ్మలాట నిజమంటాఁ బూఁచి చూచి మెచ్చినట్టు
తెమ్మగా శివమాడి తా దేవరైనట్టు
కిమ్ముల యీజన్మనందు కిందుమీఁదు నేఱక
పమ్మి భోగములనే తెప్పలఁ దేలేమయ్యా
    
చ. 3: బాలులు యిసుకగుళ్లు పఁస గట్టు కాడినట్టు
వీలి వెఱ్ఱివాఁడు గంతువేసినయట్టు
మేలిమి శ్రీవేంకటేశ మిమ్ముఁ గొలువక నేము
కాల మూరకే యిన్నాళ్ళు గడపితిమయ్యా