పుట:తాళ్ళపాక పదసాహిత్యం - రెండవ భాగం.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0107-02 దేసాక్షి సం: 02-038 అధ్యాత్మ

పల్లవి: దేవ నీదయ యెంతునో దివ్యసులభ మెంతునో
కావించి గంటగటుక(???) కాచుకుండే విదివో
    
చ. 1: వెదక నావసమా వేగుదాఁకా నిన్ను నేను
కదిసి నీమూరితి కాన వసమా
యెదుట శంఖుచక్రాల యెట్టిదైవమ నేనని
పొదుగుచు నీకు నీవే పొడచూపేవు గాక
    
చ. 2: పొగడ నావసమా పురుణించి నీగుణాలు
తగుల నావసమా నీతలఁపెఱిగి
నిగడి వేదశాస్త్రాల నిన్ను నీవే చెప్పుకొని
పగటు మాయజ్ఞానము పాపేవింతే కాక
    
చ. 3: కొలువ నావసమా గుఱుతెఱిఁగి నీవెంట
చెలఁగి నాచేతులఁ బూజించ వసమా
నిలిచి శ్రీవేంకటేశ నీవే నాయదలో నుండి
మలసి పెరరేఁపుచు మన్నించేవు గాక