పుట:తాళ్ళపాక పదసాహిత్యం - రెండవ భాగం.pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0106-06 వరాళి సం: 02-036 అధ్యాత్మ

పల్లవి: ఏమందురు యీమాటకు నిందరూ నిన్ను
నీమాయ యెంతైనా నిన్ను మించవచ్చునా
    
చ. 1: నేను నిన్నుఁ గొలిచితిని నీవు నన్ను నేలితివి
పాని పంచేంద్రియాలేల పనిగొనీని
కానిలేని బంట్లఁ దేరకాండ్లు వెట్టిగొనఁగ
దానికి నీ కూరకుండ ధర్మమా సర్వేశ్వరా
    
చ. 2: పుట్టించినాఁడవు నీవు పుట్టినవాఁడను నేను
పట్టి కర్మమేల నన్ను బాధపెట్టీని
వొట్టినసొమ్ముకు వేరొకరు చేయిచాఁచితే
తట్టి నీవు వహించుకోఁదగదా సర్వేశ్వరా
    
చ. 3: యెదుట నీవు గలవు యిహములో నేఁ గలను
చెదరిన చిత్తమేల చిమ్మిరేఁచీని
అదన శ్రీవేంకటేశ అరితేరినట్టినన్ను
వదలక రక్షించుకో వన్నెగా సర్వేశ్వరా