పుట:తాళ్ళపాక పదసాహిత్యం - రెండవ భాగం.pdf/364

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రేకు: 0174-02 సాళంగనాట సం: 02-363 నృసింహ

పల్లవి: దిక్కు నీవే జీవులకు దేవసింహమా
తెక్కుల గద్దియమీఁది దేవసింహమా

చ. 1: సురలెల్లాఁ గొలువఁగ సూర్యచంద్రులకన్నుల
తిరమైన మహిమల దేవసింహమా
నిరతిఁ బ్రహ్లాదుఁడు నీయెదుట నిలిచితే
తెరదీసితి మాయకు దేవసింహమా

చ. 2: భుజము లుప్పొంగఁగాను పూఁచిన శంఖుఁజక్రాల
త్రిజగముల నేలేటి దేవసింహమా
గజభజింపుచు వచ్చి కాచుక నుతించేటి-
ద్విజమునిసంఘముల దేవసింహమా

చ. 3: ముప్పిరిదాసులకెల్లా ముందు ముందే యొసగేటి-
తిప్పరాని వరముల దేవసింహమా
చిప్పల నహోబలాన శ్రీవేంకటాద్రిమీఁద
తెప్పల దేలేటియట్టి దేవసింహమా