పుట:తాళ్ళపాక పదసాహిత్యం - రెండవ భాగం.pdf/363

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రేకు: 0174-01 లలిత సం: 02-362 హరిదాసులు

పల్లవి: ఆతనిమూలమే జగమంతా నిది
ఆతుమలో హరి కీలు‌అయివుండుఁ గాని

చ. 1: మచ్చరము లేకున్నను మనసే రామరాజ్యము
వచ్చినట్టె వచ్చితేను వలపే చవి
యెచ్చుకుందు లేకున్న నెక్కడైనా సుఖమే
యిచ్చకుఁడై హరి తన కియ్యవలెఁ గాని

చ. 2: నెట్టుకొని నడచితే నిజమే మూలధనము
పట్టినదే వ్రతమైతే భవమే మేలు
జట్టిగా నొనగూడితే సంసారమే ఫలము
యిట్టి హరి దనకు నియ్యవలెఁ గాని

చ. 3: చెప్పినట్లు సేసితేను చేరి దేహమే చుట్టము
తప్పులు లేనిదియైతే ధర్మమే సొమ్ము
చొప్పున హరిదాసులు సోదించి చూచిన దిది
యెప్పుడు శ్రీవేంకటేశుఁ డియ్యవలెఁ గాని