పుట:తాళ్ళపాక పదసాహిత్యం - రెండవ భాగం.pdf/365

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రేకు: 0174-03 బౌళి సం: 02-364 గోవిందరాజు

పల్లవి: కన్నులపండుగలాయ కమ్మి సేవించేవారికి
సన్నల నీదాసులము సంతసించేము

చ. 1: పడఁతు లిద్దరు నీపాదములు వొత్తఁగాను
కొడుకు బ్రహ్మదేవుఁడు కొలువఁగాను
కడుపులో లోకములు కడు జయవెట్టఁగాను
గుడిగొనె నీబ్రదుకు గోవిందరాజా

చ. 2: మెత్తఁగా శేషుఁడు నీకు మించుఁబరపై వుండగా
జొత్తు మధుకైటభులు సుక్కి వోడఁగా
హత్తి దేవతలు నిన్ను నందరుఁ బూజించఁగాను
కొత్తలాయ నీబ్రదుకు గోవిందరాజా

చ. 3: పరగి నీముందరను పంచబేరము లుండఁగా
గరిమఁ జక్రము నీకుఁ గాపై వుండఁగా
తిరమై శ్రీవేంకటాద్రి తిరుపతిలోపలను
గొరబాయ నీబ్రదుకు గోవిందరాజా