పుట:తాళ్ళపాక పదసాహిత్యం - రెండవ భాగం.pdf/345

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రేకు: 0171-01 ధన్నాసి సం: 02-344 అధ్యాత్మ

పల్లవి: ఎఱఁగక వేసారు నిల జీవుఁడు
మెఱసి నిండుకున్నాఁడు మేఁటి యీదేవుఁడు

చ. 1: వూరకే పరాకైనట్టుండును దేవుఁడు
నారుకొన మతిలోఁ దనపైనే చింత
గారవాన మరి పలుకనియట్టే వుండును
యీరీతి మాటాడించేవాఁ డిన్నిటా నితఁడే

చ. 2: యెందు లేనియట్టే వుండు నెంచి చూచితే దేవుఁడు
చెంది లోకశరీరియై చెలరేఁగీని
అందరాక యెక్కడాను అడఁగినట్లనే యుండు
యిందరిఁ బోషించేవాఁడు యెప్పుడూ నితఁడే

చ. 3: చేరి లోనుగానెట్టుండు శ్రీవేంకటేశదేవుఁడు
కోరినవరము లిచ్చు గురుతుగాను
వారక యలమేల్మంగ వల్లభుఁ డిట్టిదేవుఁడు
యీరూపుతో నుండు నిందరిలో నితఁడే