పుట:తాళ్ళపాక పదసాహిత్యం - రెండవ భాగం.pdf/344

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రేకు: 0170-05 హిందొళ వసంతం సం: 02-343 ఉపమానములు

పల్లవి: అందరి రక్షించే దేవుఁ డాదరించీ జీవులను
పొందుగా యీమేలెరిఁగి పొగడరో లోకులు

చ. 1: వనము వెట్టినవాఁడు వాఁడకుండా నీరు వోసి
పెనచి కలుపు దీసి పెంచినయట్లు
పనివడి గొల్లవాఁడు పచ్చికపట్టునఁ బసుల
తనియఁగ నిల్పి నిల్పి తానే మేపినట్లు

చ. 2: కన్నతల్లి బిడ్డలకు కానుక వెన్నయుఁ బాలు-
నన్నము నిడి రక్షించినటువలెను
యెన్నఁగ బంట్లనేలే యేలిక జీతాలు వెట్టి
మన్నించి కాచుకొని మనిపినయట్లు

చ. 3: వసుధ వైద్యుఁడైనవాడు మందుమాకు లిచ్చి
పొసఁగ దేహధారులఁ బోషించినట్లు
యెసఁగ శ్రీవేంకటేశుఁ డితఁడే విశ్వకుటింబి
పసగా వరము లిచ్చి భావించీనట్లు