పుట:తాళ్ళపాక పదసాహిత్యం - రెండవ భాగం.pdf/343

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రేకు: 0170-04 బౌళి సం: 02-342 భక్తి

పల్లవి: జపములుఁ దపములుసంధ్యాదివిధులకు
నెపము నామీఁద నింతే నీకే సెలవు

చ. 1: ఫలము నినుఁ గోరని పంతమువాఁడాఁ గాను
వలెననడుగ నెంతవాఁడను నేను
చెలఁగి నీవు కర్మము సేయించఁగాఁ జేసేటి-
వెలలేక తెచ్చుకొన్న వెట్టివాఁడ నేను

చ. 2: ఆస మానితిననేటి యహంకారి నేఁ గాను
వాసికి నీతోఁ బెనఁగేవాఁడనా నేను
వేసరకుండాఁ గట్లు విడిపించి యేలుకోఁగా
దాసుఁడనై బదికేటి ధర్మపువాఁడ నేను

చ. 3: జ్ఞానినైతిననే గర్వాచారపువాఁడాఁ గాను
కానక నీపై మోపుగట్ట నోపను
ఆనుక శ్రీవేంకటేశ ఆతుమ నీవుండఁగాను
మోనాన నీకు మొక్కేటి మునివాఁడ నేను