పుట:తాళ్ళపాక పదసాహిత్యం - రెండవ భాగం.pdf/342

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0170-03 శుద్ధవసంతం సం: 02-341 శరణాగతి

పల్లవి: అందుకే సుమ్మీ నేఁజేసే‌ ఆచారాలు దైవమా
నిందవాయ నామనసు నీపై నిలుపవే

చ. 1: బట్టబయటఁ దోలితేను బందె మేయుఁ బసురము
పట్టి మేపితేను తనపనులు సేయు
ఇట్టె వదిలితేను యెందైనాఁ బారు మనసు
కట్టుక నే మఁస్తుడైతే కైవసమై యుండును

చ. 2: బడి దప్పితే బంట్లు పరదేసు లౌదురు
యెడయక కూడుకొంటే హితు లౌదురు
విడిచితే నిటులానే కడకుఁ బారు మనసు
వొడలిలో నణఁచితే వొద్దికై వుండును

చ. 3: చే వదలితే పెంచిన చిలుకైనా మేడ లెక్కు
రావించి గూఁటఁ బెట్టితే రామా యనును
భావించకుండితే యిట్టె పారు నెందైనా మనసు
శ్రీవేంకటేశుఁ గొల్చితే చేతఁ జిక్కి వుండును