పుట:తాళ్ళపాక పదసాహిత్యం - రెండవ భాగం.pdf/341

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0170-02 గుండక్రియ సం: 02-340 శరణాగతి

పల్లవి: ఇదివో నాసంపదా ఆస్తియుఁ బాస్తి నీవు ఇతరంబులు నాకుఁ బనిలేదు
పదిలంబుగ నాబ్రతుకెల్లా నీవే పాలించఁగదే నారాయణా

చ. 1: ఉపమల నే నార్జించిన ఉన్నతధనంబు నీవు
తపము సేయఁగాఁ గలిగెడు తత్ఫలంబు నీవు
జపములవలనఁ గలిగెడు నా తేజః ప్రభావమును నీవు
కపురుల దానధర్మాన పరోపకారంబులఁ బొందెడు మేలు నీవు

చ. 2: పరము నాకు నీవు పరాత్పరమును నీవు
గరిమల నిలలోపలి యనంతభోగంబులు నీవు
గరుడోరగామరసిద్ధసాధ్యగంధర్వ పదములు నీవు
సురమునిపితృపూజావేదపాఠ సుకృతంబులు నీవు

చ. 3: నాలుగాశ్రమంబులు నానావిద్య లు నీవు
తాలిమి నాపంచవింశతితత్వంబులు నీవు
ఈలీల శ్రీవేంకటేశ్వరా యిన్నియు నీవు నా కని యెరిఁగితి
యేలితివి నాప్రాణంబులు నీవు యిల సర్వోపాయంబులు నీవు