పుట:తాళ్ళపాక పదసాహిత్యం - రెండవ భాగం.pdf/340

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0170-01 గుండక్రియ సం: 02-339 గురు వందన

పల్లవి: హరి గోవిందా హరి గోవిందా - ఆనంద మానంద మాతుమకును
గురూపదేశాన వెదకఁగా వెదకఁగా - గరిమ నీయర్థము కంటి మోయయ్యా

చ. 1: హరి నన్యధర్మములు మానుమంటివి - శరణు నీకుఁ జొరుమంటివి
దురితము లణఁచేనంటివి - పరగ మోక్షం బిచ్చేనంటివి
హరి నీవచనము అమోఘము - నరులము నే మిది నమ్మితిమి
పరమపద మిప్పుడే కలిగేను- ధర నొక్కమనసుతో నున్నారమయ్యా

చ. 2: యెందు నీవే గతి యనుమంటివి - యేచి యొక్కమాఁటే చాలునంటివి
యిందరి కభయ మిత్తునంటివి - యిది నీకెపుడు వ్రతమంటివి
కందువ నీబిరుదు సత్యము - కానిమ్మని నేము చేపట్టితిమి
అంది నీవే మాకు దిక్కైతివి - అన్నిటా సంతోసాన నున్నారమయ్యా

చ. 3: ఆస మానినవాఁడెక్కు డంటివి- ఆతనివెంటఁ దిరిగేనంటివి
భాసురపాదరేణువు నే నంటివి- పావన మయ్యేనని యంటివి
మోసలేనిది నీసంకల్పము -మొక్కే మిందులకు శ్రీవేంకటేశా
ఆసపడ నితరుల నాకు నీవే యాస - యని నీదాసులమై యున్నారమయ్యా