పుట:తాళ్ళపాక పదసాహిత్యం - రెండవ భాగం.pdf/339

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0169-06 గుండక్రియ సం: 02-338 భక్తి

పల్లవి: దాఁచుకో నీపాదాలకుఁ దగ నేఁ జేసిన పూజలివి
పూఁచి నీకీరితి రూపపుష్పము లివియయ్యా

చ. 1: వొక్క సంకీర్తనే చాలు వొద్దికై మమ్ము రక్షించఁగ
తక్కినవి భండారాన దాఁచివుండనీ
వెక్కసమగు నీ నామము వెల సులభము ఫలమధికము
దిక్కై నన్నేలితివిఁక నవి తీరని నా ధనమయ్యా

చ. 2: నా నాలికపైనుండి నానా సంకీర్తనలు
పూని నాచే నిన్నుఁ బొగడించితివి
వేనామాల వెన్నుఁడా వినుతించ నెంతవాఁడ
కానిమ్మని నాకీ పుణ్యము గట్టితి వింతేయయ్యా

చ. 3: యీమాఁట గర్వముగాదు నీమహిమే కొనియాడితిఁ గాని
చేముంచి నా స్వాతంత్య్ర ము చెప్పినవాడఁ గాఁను
నేమానఁ బాడేవాఁడను నేరములెంచకుమీ
శ్రీమాధవ నే నీ దాసుఁడ శ్రీవేంకటేశుఁడవయ్యా