పుట:తాళ్ళపాక పదసాహిత్యం - రెండవ భాగం.pdf/338

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0169-05 దేవగాంధారి సం: 02-337 శరణాగతి

పల్లవి: చిత్తానఁ బెట్టకు మీమాఁట శ్రీరమణ మరవకు
హత్తి నిన్నే మెరుఁగుదు నజ్ఞాని నేను

చ. 1: నెలకొని నాలోన నీవున్నాఁడవు గనక
తలఁచకున్నా నిన్నుఁ దలఁచిన వాఁడనే
యెలమి నందరి నీవే యేలినవాఁడవు గనక
కొలువకున్నా నిన్నుఁ గొలిచినవాఁడనే

చ. 2: నెక్కొని ఆకసమెల్లా నీపాదమే కనక
మొక్కకున్నా నేను నీకు మొక్కినవాఁడనే
నిక్కి నానాక్షరములు నీపేరులే కనక
పెక్కులుగాఁ బిలువకున్నాఁ బిలిచినవాఁడనే

చ. 3: వోజ నారుగమలాల నున్నాఁడవు గనక
పూజించకున్నా నిన్నుఁ బూజించినవాఁడనే
తేజపు శ్రీవేంకటేశ దేవ నీవే గతిగాన
సాజాన నే మఱచినా శరణన్న వాఁడనే