పుట:తాళ్ళపాక పదసాహిత్యం - రెండవ భాగం.pdf/337

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0169-04 ధన్నాసి సం: 02-336 శరణాగతి

పల్లవి: నీవే దయదలఁచుక నెమ్మి రక్షించుట గాక
యీవలఁ గొలిచేనంటే యీడైనవాఁడనా

చ. 1: పరగ నేమైనా విన్నపము చేసుకొనేనంటే
హరి నీకు నెదురుమాఁటాడేవాఁడనా
గరిమ సువస్తువులు కానుక ఇచ్చేనంటే
సరుస నీకన్నా నేను సంపన్నుఁడనా

చ. 2: మెలఁగి నీగుణాలకు మెచ్చి సంతోషించేనంటే
జలజాక్ష నే నీతో సరివాఁడనా
బలువైనా నీపరమపదము గోరేనంటే
వలనైన నీతోడివంతువాఁడనా

చ. 3: తాలిమితో నాలో నిన్ను ధ్యానము సేసేకంటే
పాలఁసుడ నేను నీపాటివాఁడనా
యేలితివి శ్రీవేంకటేశ నన్నుఁ గృపతోడ
యీలీల నీమహిమలు యెరిఁగేటివాఁడనా