పుట:తాళ్ళపాక పదసాహిత్యం - రెండవ భాగం.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0106-03 రామక్రియ సం: 02-033 అధ్యాత్మ

పల్లవి: అయ్యో వారిభాగ్య మంతేకాక
నెయ్యపువెన్న వట్టుక నెయ్యి వెదకేరు
    
చ. 1: దేవుఁడు వెల్లవిరై దిక్కులెల్లా నిండుండఁగా
సోవల నాస్తికునకు శూన్యమై తోఁచు
యీవల వాన గురిసి యేరెంతబంటి వారినా
కావరపు జీవునకు గతుగతుకే
    
చ. 2: హరి శరణంటేఁ గాచే అట్టియుపాయమే వుండఁగ
విరసానకుఁ గర్మమే వెగ్గళమాయ
పరగ నరులకెల్లాఁ బట్టపగలై యుండఁగా
అరయఁ గొన్ని జంతుల కంధకారమాయను
    
చ. 3: యిక్కడ శ్రీవేంకటేశుఁ డెదుటనే వుండఁగాను
అక్కటా మూఢున కెందు ననుమానమే
మక్కువ నింతా నమృతమయమైనఁ గోడికి
తెక్కులఁ దవ్వఁ బొయ్యేది తిప్పపెంటలే