పుట:తాళ్ళపాక పదసాహిత్యం - రెండవ భాగం.pdf/305

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0163-05 ముఖారి సం: 02-304 భగవద్గీత కీర్తనలు

పల్లవి: ఇట్టి నా వెఱ్ఱితనము లేమని చెప్పుకొందును
నెట్టన నిందుకు నగి నీవే దయఁజూడవే

చ. 1: పాటించి నాలో నుండి పలికింతువు నీవు
మాటలాడ నేరుతునంటా మరి నే నహంకరింతును
నీటున లోకములెల్లా నీవే యేలుచుండఁగాను
గాఁటాన దొరనంటా గర్వింతు నేను

చ. 2: నెమ్మదిఁ బ్రజలనెల్లా నీవే పుట్టించఁగాను
కమ్మి నేనే బిడ్డలఁ గంటినంటా సంతసింతును
సమ్మతి నీవే సర్వసంపదలు నొసఁగఁగాను
యిమ్ముల గడించుకొంటి నివి నేనంటా నెంతు

చ. 3: మన్నించి యిహపరాలు మరి నీవే యియ్యఁగాను
యెన్నుకొందు నాతపోమహిమ యిది యనుచును
వున్నతి శ్రీవేంకటేశ నన్ను నేమి చూచేవు
అన్నిటా నాయాచార్యు విన్నపమే వినవే