పుట:తాళ్ళపాక పదసాహిత్యం - రెండవ భాగం.pdf/304

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0163-04 ముఖారి సం: 02-303 వేంకటగానం

పల్లవి: సర్వేశ్వరా నీతో సరి యెవ్వరు
పూర్వపువారు చెప్పఁగాఁ బూఁచి కొలిచేఁ గాని

చ. 1: చేరి వేదములు నిన్నుఁ జెప్పఁగా వినుటే కాని
నీరూపము దర్శించేవార లెవ్వరు
ధారుణిలో నీయవతారాలే చూచుట
ధీరత నీమహిమలు తెలిసేవా రెవ్వరు

చ. 2: భూమివారిఁ జూచి నిన్నుఁ బూజలు సేయుట గాని
కామించి నీతో మాటాడే ఘను లెవ్వరు
దీమసాన నీ దాసుల ద్రిష్ట మెరుగుట గాని
యీమేర నీ దైవిక మెరిగే వా రెవ్వరు

చ. 3: వరములు నీ వియ్యఁగా వచ్చి సేవించుట గాని
కెరలి నీమూర్తి వెదకేవా రెవ్వరు
హరి శ్రీవేంకటేశా నీకరుణవారౌట గాని
అరసి నిన్ను సుద్దులడిగేవా రెవ్వరు