పుట:తాళ్ళపాక పదసాహిత్యం - రెండవ భాగం.pdf/303

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0163-03 సామంతం సం: 02-302 శరణాగతి

పల్లవి: ఇప్పుడే నే నొడఁబడ మరవఁగఁ దగదు జెప్పితి యెల్లనాఁడు
నెప్పున నే నెంతకల్లరినైనా నీదాసుఁడనని యందురుగా

చ. 1: మఱతునో తలఁతునో నిన్ను మాఁటల నేతప్పు గలుగునో
యెఱఁగక నీదాసులఁజూచి యేమని పలుకుదునో
నెఱసిన నాకర్మఫలంబులు నీకు సమర్పణ సేసితిని
మఱి నామీఁదట నేరము లెంచక మాధవ నన్నిటు రక్షించవే

చ. 2: అలతునో సొలతునో నే నీయందు భక్తి సేతునో సేయనో
యెలమిని నీకు నివేదించక యేమేమి భుజియింతునో
తలఁచేటి నామనసే నీకును ధనముగాఁ గప్పము వెట్టితిని
పలుమరు నన్నును తగవుకుఁ దియ్యక పరమాత్మా ననుఁ గావఁగదే
    
చ. 3: నేరనో నేర్తునో నీకైంకర్యము నేమము లేమేమి మానితినో
నీరూపము నే సేవించి యెక్కడ నే ననుమానించితినో
మేరతోడ మావారు చెప్పఁగా మిమ్మింతట నే నమ్మితిని
వారిఁ జూచైన శ్రీవేంకటేశా వరదుఁడవై మము మన్నించఁ గదవే