పుట:తాళ్ళపాక పదసాహిత్యం - రెండవ భాగం.pdf/302

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0163-01 సామంతం సం: 02-301 వేంకటగానం

పల్లవి: ఆనతియ్యఁగదవే అందుకే కాచుకున్నాఁడను
పూనుక నీవెంత నేర్పరివైనా భువి మనసుపేదను నేను

చ. 1: కొలిచేమనే బంట్లు నీకుఁ గోటానఁగోట్లు గలరు నిన్నుఁ
దెలిసేమనే జ్ఞానులు తెందేపలున్నారు
తలఁచి వరములడిగేవారలు తలవెంట్రుకలందరు వారె
యిల సందడిలో నాకొలువు యెటువలె నెక్కీనో

చ. 2: పనులకుఁ బాల్పడినవారు బ్రహ్మాదిదేవతలట
వినుతులు సేయఁ దొడంగినవె వేదరాసులట
మునుకొని ధ్యానించువారు మునులెందరైనాఁ గలరట
వినయపు నామనవి సనవులకు వేళ లెపుడు గలిగీనో

చ. 3: వున్నతితోడుత నిన్ను మోఁచుటకు వున్నారు గరుఁడఁడు శేషుఁడు నీకు
అన్నిటాను నీకాఁగిటిలోపల నలరీ నలమేల్మంగ
యెన్నఁగ శ్రీవేంకటేశా నన్నును యేలితి వింతటిలోనే
పన్నిన నా మొక్కులు నీ కేబాగులఁ జేరినో