పుట:తాళ్ళపాక పదసాహిత్యం - రెండవ భాగం.pdf/301

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0162-04 సామంతం సం: 02-300 వైరాగ్య చింత

పల్లవి: ఏది గతి నే నొక్కఁడనే యెందరి కోపుదును
నీదయతో మన్నించఁగదవే నీరజనాభా

చ. 1: మోహాంధకారము యెక్కడచూచిన ముంచుకవున్నది
దేహాభిమానము అందుకుఁ దోడు దీకొనివచ్చీని
సాహసభూతము ఘనహింసలకే చాఁపించీఁ జేయి
దాహపుటాసలు వెనకముందరల తరవులువెట్టీని

చ. 2: కోపాగ్నికణములు సారెకుఁ జుట్టుక గుబ్బతిలఁ దొడఁగె
పైపై వయోవికారంబులు చలపట్టుక తిరిగీని
చాపల గర్వము యెవ్వరినైన సాధింపించీని
తీపుల ధనములు మీఁదిమీఁదనే తీదీపులు రేఁచీని

చ. 3: భావజవిలాస మప్పటప్పటికి బలుములు చూపీని
వేవేలు సంపద లెందుచూచినా వేడుకసేసీని
శ్రీవేంకటేశ యలమేల్మంగను చేకొను దేవుఁడా
యీవేళను నన్నేలితివి నిన్నియు తగ వసమయ్యీని