పుట:తాళ్ళపాక పదసాహిత్యం - రెండవ భాగం.pdf/300

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0162-03 సామంతం సం: 02-299 వైష్ణవ భక్తి

పల్లవి: ఎదురుమాటలాడితి నీకు యీతప్పులు లోఁగొను నీవు
పదరఁగఁ దగదు నీకు పంతములిచ్చితిఁ గావఁ గదే

చ. 1: మునుపే నే విన్నవించితిని విన నవధరించితివి నీవు
వెనక వేసుకో శరణు చొచ్చితిని విడువకు నన్ననుచు
ననుఁ జూచి 'దేహి' యంటే 'నాస్తి' యనరాదు నీకు
ఘనయాచకుఁడను నేను కడుదాతవు నీవు

చ. 2: వెదకి నిను వేఁడుకొంటిని విచ్చేసితివి మాయింటికి
వదలఁదగదు నీభక్తి యొసఁగు నీవాఁడను పాయకుమనుచు
పదిలంబుగ మొక్కిన చేతులు బలిమిఁ గోయరాదు
యిదివో బంటను నేను యేలినవాఁడవు నీవు

చ. 3: మురిగి నీముద్రలు మోచితిని మన్నించితివిటు నను నీవు
కరుణతోడ నాయపరాధంబులు కడపు కావుమనుచు
యిరవై నీపేరు వెట్టితే నియ్యకొనక పోరాదు
నరమాత్రుఁడ నే శ్రీవేంకటేశ నాయకుఁడవు నీవు