పుట:తాళ్ళపాక పదసాహిత్యం - రెండవ భాగం.pdf/306

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0163-06 ముఖారి సం: 02-305 వేంకటగానం

పల్లవి: ఇటు నిను దెలియఁగ ఎంతటివారము
తటుకున నాసలఁ దగులుట గాక

చ. 1: నానామూర్తులు నగధర నీరూపు
యే నెలవుల నిన్నెటువలెఁ దలఁచుట
పూని నీ భావము పొందుగాఁ జెప్పఁగా
వీనులు చల్లఁగా వినుటే కాక

చ. 2: పెక్కు నామములు బిరుదు లనంతము-
లెక్కడ గొలదిగ నెన్నెని పొగడుట
యిక్కువ సేసుక యిందులో నొకటి
పక్కన నొకమరి పలుకుట గాక

చ. 3: వేవేలు గలవు నీ విహార భూములు
యేవిధమున నెందెందని తిరుగుట
శ్రీవేంకటేశా నీ శృంగారమెల్లను
సేవించి ముదమునఁ జెలఁగుట గాక