పుట:తాళ్ళపాక పదసాహిత్యం - రెండవ భాగం.pdf/139

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0134-02 గుజ్జరి సం: 02-138 వైరాగ్య చింత

పల్లవి: ఇందరిలో నే మెందుఁబోలుదుము యిందరిఁ బోలిన జీవులమే
కందువ వీరలఁ దలఁచి చిత్తమిది కలఁగెడి దైవమ కావఁగదే

చ. 1: యెందరొకో జరాదుఃఖము లేచి యనుభవించేటివారు
యెందరొకో దరిద్రదుఃఖము లెఁసగి యలమటించేటివారు
యెందరొకో బంధనతాడనహీనదెసల నుండెడివారు
యెందరొకో దాసదాస్యవిధి నెడయరాక చెఱలయినవారు

చ. 2: యెందరొకో మరణదెసలచే నిల సంయోగవియోగదుఃఖితులు
యెందరొకో జన్మరోగముల నెక్కువ భయమందేటివారు
యెందరొకో రాజుల చోరుల హింసలకు లోన యినవారు
యెందరొకో పొడమిన జీవుల కెక్కడ నెక్కడ నేపాటో

చ. 3: యెందరొకో యీదుఃఖనివృత్తికి యెడసి మిమ్ముఁ గొలిచినవారు
యెందరొకో సంపదలకు లోనై యేతాయాతనఁ బడువారు
యెందరొకో శ్రీవేంకటేశ యిపు డెక్కువ నీశరణము చొచ్చి
యిందును నందును సుఖులై లోకుల నిందరిఁ జూచుచు నవ్వెడివారు