పుట:తాళ్ళపాక పదసాహిత్యం - రెండవ భాగం.pdf/140

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0134-03 గుండక్రియ సం: 02-139 అధ్యాత్మ

పల్లవి: నిన్నూ నన్నూనెంచుకోని నేరమి గాక
పన్నిన సూర్యునికాంతి ప్రతిసూర్యుడౌనా

చ. 1: జలధిలోపలి మీను జలధి దా నౌనా
జలములాధారమైన జంతువు గాక
నెలవై నీలోనివాడఁ నీవే నే నౌదునా
పొలసి నీయ్యాధరువుబొమ్మ నింతే కాక

చ. 2: రాజువద్దనున్న బంటు రాజే తా నౌనా
రాజసపు చనవరి రచనే కాక
సాజమై నిన్నుఁ గొలిచి సరిగద్దె నుందునా
వోజతో నిన్ను సేవించి వుందునింతే కాక

చ. 3: ము త్తెపుఁజిప్పల నీరు మున్నీటివలె నుండునా
ముత్తెములై బలిసి లో మొనపుఁ గాక
నిత్తెపు శ్రీవేంకటేశ నీశరణాగతులము
మొత్తపు లోకుల మాముక్తులము గాక