పుట:తాళ్ళపాక పదసాహిత్యం - రెండవ భాగం.pdf/138

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0134-01 రామక్రియ సం: 02-137 వైరాగ్య చింత

పల్లవి: వెలుపల మఱవక లోపల లేదు వెలుపలఁ గలిగిన లోపల మఱచు
చలమును నిదియే ఘడియ ఘడియకును సాధించిన సుఖమటు దోఁచు

చ. 1: వెలుపలి వెలుఁగే చూడఁగ లోపలి వెడ చీఁకటి గాననియట్లు
అలరి ప్రపంచజ్ఞానికిఁదనలో నాత్మజ్ఞానము గనరాదు
పలుమరు చీఁకటి చూడఁగఁ జూడఁగ బయలే వెలుఁగై తోఁచినయట్లు
అలయక తనలోచూపు చూచినను అంతరంగమున హరిఁ గనును

చ. 2: జాగరమే కడుఁ జేయఁగఁ జేయఁగ సతతము నిద్దుర రానట్లు
చేగల నింద్రియములలోఁ దిరిగిన చిత్తవికారము లయపడదు
యీగతి నిద్దురవోఁగాఁ బోఁగా నిలలో సుద్దులు యెఱఁగనియట్టు
యోగపు టేకాంతంబును దన మనసొగి మరవఁగ మరవఁగ హరిఁ గనును

చ. 3: దేహపు టాకాశపు నిట్టూర్పులు బాహిరపు బయట నడగినయట్లు
ఆహ జీవుని జననమరణములు అందే పొడముచు నందడఁగు
వూహల శ్రీవేంకటపతి వాయువు కొగి నాకాశము వొక్క సూత్రము
ఆహా ప్రాణాపానవాయువులు ఆతుమ నిలుపుటే హరిఁ గనుట