పుట:తాళ్ళపాక పదసాహిత్యం - రెండవ భాగం.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0102-05 సామంతం సం: 02-011 అధ్యాత్మ

పల్లవి: ఏమి సేయుదు నింక నిందిరాధీశ్వరుఁడా
నీమఱఁగు చొచ్చితిని నెరవేర్తు గాక

చ. 1: కడివోని జవ్వనము కలిమిలేమెఱుఁగునా
బడినుండి మిగుల రుణపరచుఁ గాక
అడియాసలెల్లాఁ బుణ్యముఁ బాప మెఱుఁగునా
వెడగుఁ దనలో దయ విడిపించుఁ గాక

చ. 2: వలపు వెఱ పెఱుఁగునా వాఁడిమొనలకునైన
బలిమిఁ దూరించఁ జలపట్టుఁ గాక
చలనమందిన మనసు జాతి నీతెఱుఁగునా
కలిసి హేయమున కొడిగట్టించుఁ గాక

చ. 3: యెలమి రతిపరవశము యెగ్గుసిగ్గెఱుఁగునా
బలిమిఁ దిట్లకు నొడఁబఱచుఁ గాక
యిలలోన శ్రీవేంకటేశ నీమాయ లివి
తలఁగించి యేలితివి దయసేతు గాక