పుట:తాళ్ళపాక పదసాహిత్యం - రెండవ భాగం.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0102-06 భైరవి సం: 02-012 వైరాగ్య చింత

పల్లవి: అయ్యో మాయలఁ బొంది అందునిందు నున్నవారు
యియ్యగొనఁ గర్తలుగా రెఱఁగరు జడులు

చ. 1: చుక్కలై యుండినవారు సురలై యుండినవారు
యిక్కడనుండి పోయిన యీజీవులే
దిక్కుల వారి నిందరు దేవతలంటా మొక్కేరు
యొక్కుడైన హరి నాత్మ నెఱఁగరు జడులు

చ. 2: పాతాళవాసులను పలులోకవాసులును
యీతరవాత నుండిన యీ జీవులే
కాతరాన వారిపుణ్యకతలే వినేరు గాని
యీతల శ్రీహరికత లెఱఁగరు జడులు

చ. 3: యిరవెఱిఁగిన ముక్తు లెఱఁగని బద్దులు
యిరవై మనలోనున్న యీజీవులే
సిరుల మించినవాఁడు శ్రీవేంకటేశ్వరుఁడే
శరణాగతులు దక్క చక్కఁ గారు జడులు