పుట:తాళ్ళపాక పదసాహిత్యం - రెండవ భాగం.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0102-04 మలహరి సం: 02-010 భక్తి

పల్లవి: అతిసులభం బిది యందరిపాలికి
గతియిది శ్రీపతి కైంకర్యంబు
    
చ. 1: పాలసముద్రము బలిమిఁ దచ్చికొని-
రాలరి దేవత లమృతమును
నాలుక నిదె హరినామపుటమృతము
యేల కానరో యిహపరసుఖము
    
చ. 2: అడరి బాఁతిపడి యవని దేవతలు
బడివాయరు యజ్ఞభాగాలకు
విడువక చేతిలో విష్ణుప్రసాదము
కడిగడియైనది కానరు గాని
    
చ. 3: యెక్కుదురు దిగుదు రేడులోకములు
పక్కనఁ దపముల బడలుచును
చిక్కినాఁడు మతి శ్రీవేంకటేశ్వరుఁ -
డిక్కడి తుదిపద మెఱఁగరు గాని