పుట:తాళ్ళపాక పదసాహిత్యం - రెండవ భాగం.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0102-03 సాళంగనాట సం: 02-009 నృసింహ, మాయ

పల్లవి: అన్నిటి కెక్కుడు యీవి హరియిచ్చేది
మన్నించు నాతనికంటే మఱి లేరు దొరలు
    
చ. 1: తగు బ్రహ్మలోకముదాఁకా నెక్కిచూచిన
మగుడఁ బుట్టే లోకాలే మనుజులకు
తెగి యిచ్చే యింద్రాదిదేవతల వరములు
యెగువదిగువలను యీసందివే
    
చ. 2: మాయలోనఁ బుట్టేది మాయలోనఁ బెరిగేది
కాయదారులకు నెల్లాఁ గలిగినదే
సేయరాని పుణ్యమెల్లాఁ జేసి గడించుకోనేది
చాయల బహురూపపుసంసారమే
    
చ. 3: చెడని వైకుంఠ మిచ్చుఁ జేటులేని వర మిచ్చు
వెడమాయఁ బెడబాపు విష్ణుఁ డీతఁడే
యెడయెక శ్రీవేంకటేశుఁడై వున్నాఁడు వీఁడే
జడియ కితఁడే కాచు శరణంటేఁ జాలును