పుట:తాళ్ళపాక పదసాహిత్యం - మూడవ భాగం.pdf/76

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0213-03 సామంతం సం: 03-075 అధ్యాత్మ

పల్లవి:

పరుసము సోఁకక పసిఁడౌనా
పురుషోత్తముఁడే బుద్ధిచ్చుఁ గాక

చ. 1:

భువి భోగములకుఁ బుట్టిన దేహము
వివరపు మోక్షము వెదకీనా
యివల సకలమును యేలేటి దేవుఁడు
తవిలి రక్షింపుట ధర్మముఁ గాక

చ. 2:

బెరసి యాసలనే పెరిగేటి దేహము
ధరఁ గొంతయినాఁ దనిసీనా
అరుదుగ నంతర్యామగు దేవుఁడు
పొరిఁ బెర రేఁచుటే పొందౌఁ గాక

చ. 3:

ఘనమగు సంసారకారణ జీవుఁడు
తన సుజ్ఞానముఁ దలఁచీనా
వెనక మునుప శ్రీవేంకటపతియే
కనుఁగొని మమ్మిటు కాచుటఁ గాక