పుట:తాళ్ళపాక పదసాహిత్యం - మూడవ భాగం.pdf/77

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0213-04 లలిత సం: 03-076 దశావతారములు

పల్లవి:

నీమహి మది యెంత నీవు చేసే చేఁతలెంత
దీమసపు నీ మాయలు తెలియరాదయ్యా

చ. 1:

నీ పాదతీర్థము నెత్తి మోచె నొకఁడు
పూఁపకొడుకై యొకఁడు బొడ్డునఁ బుట్టె
యేపున నింతటివారి కెక్కుడైన దైవమవు
మోపుచు ధర్మరాజుకు మొక్కుటెట్టయ్యా

చ. 2:

నీ లీల జగమెల్లా నిండి యున్నదొకవంకఁ
నోలి నీలో లోకాలున్నవొకవంక
యే లీలఁ జూచినాను యింతటి దైవమవు
బాలుఁడవై రేపల్లెలోఁ బారాడితివెట్టయ్యా

చ. 3:

శ్రీసతికి మగఁడవు భూసతికి మగఁడవు
యీ సరుస శ్రీవేంకటేశుఁడవు
రాసి కెక్కి నీవింతటి రాజసపు దైవమవు
దాసులము మా కెట్ల దక్కితివయ్యా