పుట:తాళ్ళపాక పదసాహిత్యం - మూడవ భాగం.pdf/72

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0212-05 సామంతం సం: 03-071 ఉపమానములు

పల్లవి:

ఎన్నఁడు మంచివాఁడ నయ్యేను నేను
నన్ను నీవే మన్నించి నడుపవే దయివమా

చ. 1:

వేఁపమానికిని చేఁదు విడువక వుండేది
యే పొద్దు సహజమే యెంతైనాను
పాపపుణ్యలంపటానఁ బరగి వుండేటి నేను
చాపలదుర్గుణినౌట సహజమే

చ. 2:

పాముకు విషమెప్పుడు పండ్లఁ బెట్టుకుండేది
భూమిలో సహజమే పొరి నెంతైనా
కామక్రోధుఁడ నాకుఁ గరుణ యించుక లేక
సామజపు దుర్మదము సహజమే

చ. 3:

అటుగాన శ్రీవేంకటాధిప నాకిఁక వేరే
తటుకన నేఁడు శాంతము వచ్చీనా
ఘటన నీ కృపయందు గలిగిన మేలు నాపై
తటుకన ముంచి నన్ను దరి చేర్పవే