పుట:తాళ్ళపాక పదసాహిత్యం - మూడవ భాగం.pdf/71

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0212-04 వరాళి సం: 03-070 శరణాగతి

పల్లవి:

పెంచి తమ పెట్టుఁజెట్టు పెరికివేయ రెవ్వరు
మంచివాఁడఁ గాకున్న మన్నించకుండేవా

చ. 1:

తెరువు దప్పి యడవిఁ దిరిగేటివారిఁ దెచ్చి
తెరువునఁ బెట్టుదురు తెలిసినవారలు
నరుఁడనై నేరక నడిచేటి నన్ను నీవు
మరిగించి కావక మానవచ్చునా

చ. 2:

దిక్కుమాలినట్టివారిఁ దెచ్చి దయగలవారు
దిక్కయి కాతురు వారి దిగఁదోయరు
తక్కక మాయలోఁ బడి దరిదాపు లేని నన్ను
వెక్కసాన రక్షించక విడిచేవా నీవు

చ. 3:

ఆవల భయపడ్డవా రంగడిఁ బడితే దొర-
లోపల విచారించి వూరడింతు రంతలోనే
శ్రీవేంకటేశ నీవు సృష్టికల్లా నేలికవు
వేవేలు మా మొర నీవు విచారించకుండేవా