పుట:తాళ్ళపాక పదసాహిత్యం - మూడవ భాగం.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0201-06 బౌళి సం: 03-006 శరణాగతి

పల్లవి:

వెఱ్ఱివాఁడ వెఱ్ఱివాఁడ వినియుఁ గనియుఁ మరి
వెఱ్ఱి దెలిసి రోఁకలి వేరె చుట్టేఁ గాక

చ. 1:

పుట్టించిన వాడవట పూచి నన్నుఁ బెంచలేవా
కట్టఁగడ నమ్మని నాకడమే కాక
వొట్టి నాలో నుందువట వొగిఁ బాపము నాకేది
గట్టిగాఁ బుణ్యము వేరే కట్టుకొనేఁ గాక

చ. 2:

యేడనైనా నీవే యట యెదుట నుండఁగలేవా
వేడ(డె?) వెట్టి యేడనై నా వెదకేఁ గాక
ఆడినదెల్లా నీవట అందులోఁ దప్పులన్నవా
వీడు పడ్డ తలఁపుతో వెరచేఁ గాక

చ. 3:

భావించితే మెత్తువట పరము నీ వియ్యలేవా
నీవాఁడననని నా నేరమే కాక
శ్రీవేంకటేశుఁడ నేను చేరి నీకు శరణంటి
దేవుఁడవై కావఁగా నే దిద్దుకొనేఁ గాక