పుట:తాళ్ళపాక పదసాహిత్యం - మూడవ భాగం.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0202-01 ఆహిరి సం: 03-007 అధ్యాత్మ

పల్లవి:

పూచిన యీ దేహము పువ్వుగాని పిందెగాని
చేచేత నెవ్వరికిఁ జెప్పనోపఁ బ్రియము

చ. 1:

పుట్టించిన దైవము పూరి మేపునా మమ్ముఁ
బట్టిన పూర్వకర్మము పాసిపాయ్యీనా
మెట్టిన సంసారము మెదిగిన పాటే చాలు
తొట్టి కన్నవారినెల్ల దూర నోప మిందుకు

చ. 2:

నొసలఁ వ్రాసిన వ్రాలు నుసిగితే మానీనా
కొసరి జగము నాకే కొత్తలయ్యీనా
వుసురుతోడి సుఖము వుండిన పాటే చాలు
కొసరి జన్మములింకాఁ గోరనోప నేను

చ. 3:

యేలినవాఁడు శ్రీహరి యేమి సేసినా మేలె
వేళతో నాతఁడే శ్రీవేంకటేశుఁడు
పాలించె నాతఁడు మమ్ము పదివేలులాగులను
యీలాగులనే సుఖిఇం(???)చేము నేము