పుట:తాళ్ళపాక పదసాహిత్యం - మూడవ భాగం.pdf/69

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0212-02 పాడి సం: 03-068 అద్వైతము

పల్లవి:

కాకుంటే యీ శూన్యవాద కఠినచిత్తుల చేత
పైకొని వివేకులకు బ్రదుకఁగ వచ్చునా

చ. 1:

అల్లనాఁడు నిరాకార మనెడి మాటలచేత
వెల్లిఁబోయ లోకములో విజ్ఞానమెల్లా
కల్లని మీ త్రివిక్రమాకారము చూపి మీరు
చెల్లఁ బెట్టితిరి వేదశిఖలందు మరియు

చ. 2:

ఆలకించి యహంబ్రహ్మ మనెడి బుద్ధుల చేత
గాలిఁ బోయ భక్తి యల్లా కాలమందే
యేలి ప్రహ్లాదునికిఁగా హిరణ్యకశిపు నొద్ద
యేలికబంటువరుస లిందె చూపితిరి

చ. 3:

అంతా నొక్కటియనే అధర్మవిధులచేత
గుంతఁబడెఁ బుణ్యమెల్లాఁ గొల్లఁబోయి
ఇంతట శ్రీవేంకటేశ యెక్కుడు నేనని కొండ
వింతగాఁగఁ బొడవెక్కి విఱ్ఱవీఁగితివి