పుట:తాళ్ళపాక పదసాహిత్యం - మూడవ భాగం.pdf/68

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0212-01 లలిత సం: 03-067 అధ్యాత్మ

పల్లవి:

చెలఁగి నా కిందుకే చింతయ్యీని
తెలిసినదాఁకా నిది ద్రిష్టమయ్యీనా

చ. 1:

హరి పుట్టించిన దేహి హరినే కొలువక
నరులఁ గొలుచుట అన్యాయమయ్యా
గరిమ నేరు గుడిచి కాలువఁ బొగడఁబోతే
యెరవెరవే కాక యితవయ్యీనా

చ. 2:

దేవుఁ డిచ్చినట్టి బుద్ది దేవుని పయిఁ బెట్టక
భావ మింద్రియాల కియ్యఁ బాపమయ్యా
జీవిత మొకరి సొమ్ము జీవించి యొకరి వెంట
ఆవలఁ బరువులిడు టందమయ్యినా

చ. 3:

అరిది శ్రీవేంకటేశుఁ డంతరాత్మయి వుండఁగాను
శరణనకుండు టనాచారమయ్యా
ధరఁ దన యింటఁ గోటిధన మట్టే వుండఁగాను
మరలి తిరియఁబోతే మట్టుపడీనా