పుట:తాళ్ళపాక పదసాహిత్యం - మూడవ భాగం.pdf/67

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0211-06 పాడి. సం: 03-066 శరణాగతి

పల్లవి:

వాఁడివో వీఁడివో హరి వలసినవారికెల్లా
మూఁడు లోకముల మరి మొరఁగఁ జోటేది

చ. 1:

బహిరంతరాన హరి ప్రత్యక్షమై యుండఁగాను
సహజానఁ బ్రత్యక్ష విచారమేల
ఇహములోఁ గలవెల్లా యీతని లీలై యుండఁగా
విహరించే లీల వేరే వెదకనేలా

చ. 2:

మనికై యన్నిటానుండి మాటలాడుచుండఁగాను
వెనక హరి మాటలు వేరేవున్నవా
కనుచూపతఁ డంతటా కలగొనఁ జూడఁగాను
చనవిచ్చి కృపాదృష్టి చల్లుమననేలా

చ. 3:

నెలవై యాతఁ డిన్నిటా నిండుకొనియుండఁగాను
అలరి వేరే వచ్బీనననేలా
యెలమి శ్రీవేంకటేశు యిచ్చకొలఁదే యింతా
పలుమారు నిట్టట్టని భావించఁ దగునా