పుట:తాళ్ళపాక పదసాహిత్యం - మూడవ భాగం.pdf/65

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0211-04 ఆహిరి సం: 03-064 అధ్యాత్మ

పల్లవి:

ఎక్కడ నున్నారో సురలెవ్వరు భూమికి దిక్కో
తొక్కులఁబడె జీవుఁడు దుండగీల చేతను

చ. 1:

ఆసలనియెడి వెఱ్ఱియంగడి వెంటాఁ దిప్పె
దోసిలొగ్గించె దైన్యము దొరలెదుట
యీసుల నాఁకటి(లి?) విషమేమైనాఁ దినిపించె
గాసిఁబడె జీవుఁడిదె కన్నవారి చేతను

చ. 2:

కడుఁ గోపపు భూతము కాయమెల్లా మఱపించె
వడి నజ్ఞానపు టేరు వరతఁగొట్టె
నడుమఁ బాపపుచొక్కు నరకపుగుంటఁ దోసె
గడుసాయ జీవుఁడిదె కన్నవారి చేతను

చ. 3:

భవము సంసారపు బందెలదొడ్డిఁ బెట్టించె
తగి(వి?)లింద్రియపు తాళ్లు దామెనఁ గట్టే
యివల శ్రీవేంకటేశుఁ డింతలో దిక్కయి కాచె
కవడు వాసె జీవుఁడు కన్నవారి చేతను