పుట:తాళ్ళపాక పదసాహిత్యం - మూడవ భాగం.pdf/64

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0211-03 గౌళ సం: 03-063 గురు వందన, నృశింహ

పల్లవి:

చింతలు రేఁచకు మమ్ము చిత్తమా నీవు
పంతముతో మముఁగూడి బతుకుమీ నీవు

చ. 1:

తల్లి శ్రీమహాలక్ష్మి తండ్రి వాసుదేవుఁడు
ఇల్లు మాకు బ్రహ్మాండమింతా నిదె
బల్లిదపు హరిభక్తి పాఁడీఁబంటా నాకు
వొల్లము కర్మఫలము లొకటి నేము

చ. 2:

జ్ఞానమే మాకు ధనము సర్వవేదములు సొమ్ము
వూనిన వై రాగ్యమే వుంబళి మాకు
ఆనిన గురుసేవలు ఆఁడుబిడ్డలు నాకు
మేనితోనే తగులాయ మేలు మాకుఁ జేరెను

చ. 3:

యేలికె శ్రీవేంకటేశుఁడింటి దేవపూజ మాకు
పాలు గల బంధువులు ప్రపన్నులు
కీలు మాకు నీతని సంకీర్తన మోక్షమునకు
యేలా ఇంకా మాకు నేమిటితో గొడవ