పుట:తాళ్ళపాక పదసాహిత్యం - మూడవ భాగం.pdf/63

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0211-02 ముఖారి సం: 03-062 వేంకటగానం

పల్లవి:

తాము స్వతంత్రులు గారు తమయంతను
ఆమీఁదటి గురి అది నీవు

చ. 1:

యెలమి స్వర్గమేలేటి ఇంద్రునికినైనాను
అలమి కోరేటి ఫలమది నీవు
బలిమిఁ గైలాసమేలే పతి రుద్రునికినైనా
నిలుకడైన పదము నీ పదము

చ. 2:

యెక్కుడు సత్యలోకము యేలే బ్రహ్మకునైనా
ఇక్కువఁ జేరేచోటు యెందును నీవు
వెక్కసపుఁ బుణ్యముల వేదములకైనాను
అక్కరతో ముఖ్యమైన అర్థమెల్లా నీవు

చ. 3:

నాఁడు నాఁడే ముక్తులైన నారదశుకాదులకు
నేఁడును విహరించే నెలవు నీవు
పోఁడిమి శ్రీవేంకటేశ పోలించ నెవ్వరూ లేరు
మూడులోకముల నీవే మూలము నీవే