పుట:తాళ్ళపాక పదసాహిత్యం - మూడవ భాగం.pdf/582

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0300-03 ధన్నాసి సం: 03-580 శరణాగతి

పల్లవి:

పరిణామమే మాకుఁ బతివి నీవు గలుగ
శరణాగతే మాకు సకలరక్షయ్యా

చ. 1:

నుదుటి వ్రాసిన వ్రాఁత నూఁటికి నీ తిరుమణి
యెదురేది మాకు నేఁడు యేఁడులోకాల
పెదవి మీఁదటి తేనె పేరుకొనే నీ జపము
అదన మాకు నదివో అక్కరలేదయ్యా

చ. 2:

చేతికి వచ్చిన సొమ్ము చేరె నీ శంఖుచక్రాలు
ఘాతల మా కిఁక నేది గడమ లేదు
నీతితో వెనుబలము నీ దాసుల సేవ
రాతిరిఁబగలు నిదె రాజుల మోయయ్యా

చ. 3:

తొల్లిఁటి పుణ్యఫలముతోడనే నీ సంకీర్తన
తల్లిదండ్రి నీవు నీ తరుణియును
యెల్లగా శ్రీవేంకటేశ యిన్నియుఁ గలిగె మాకు
చల్లఁగా బ్రతికితిమి జయ మందవయ్యా