పుట:తాళ్ళపాక పదసాహిత్యం - మూడవ భాగం.pdf/583

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0300-04 పాడి సం: 03-581 శరణాగతి

పల్లవి:

ఇందులోన నే నెవ్వరిఁబోలుదు
అంది వీవాఁడ నే ననుకొంటిఁ జుమ్మీ

చ. 1:

జలజనాభ నీ శరణనువారలు
అల నారదసనకాదులు
కెలన మరియు నీ కింకరవర్తులు
తెలిసిన బ్రహ్మాదిదేవతలు

చ. 2:

నోరార హరి నిను నుతించువారలు
చేరువ నుండేటి శేషాదులు
ధారుణిలో నీదాసాన(ను?)దాసులు
మారుతిముఖ్యులు మహామహులు

చ. 3:

బడి నీచే ముక్తి వడసినవారలు
సుడిగొను మునిజన శుకాదులు
కడఁగిన శ్రీవేంకటపతి నీవే
తడవి నన్ను దయదలఁచుమీ