పుట:తాళ్ళపాక పదసాహిత్యం - మూడవ భాగం.pdf/581

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0300-02 లలిత సం: 03-579 విష్ణు కీర్తనం

పల్లవి:

నీవే యంతర్యామివి నీ వున్నదే వైకుంఠము
ఆవలఁ బరమపదమన నింకాఁ గలదా

చ. 1:

యిందరు జంతువులు నీ విచ్చిన రూపులు మోచి
బొందితో నీకే నెలవై పుట్టినారు
కందువ నీ ప్రపంచపు కైంకర్యములు సేసి
అందిరి జీవన్ముక్తు లదివో చాలదా

చ. 2:

యేలిక వంచిన పనే యింద్రియభోగములెల్ల
తోలితోలి రాచాజ్ఞ తోయకున్నారు
కాలము నిన్నుఁ బాయరు గర్భగోళమం దున్నారు
యీ లోకమే సాలోక్యమిది యింత చాలదా

చ. 3:

జ్ఞానము నజ్ఞానమేది స్వామికార్యములోన
మానక నీ పనులలో మత్తులైనారు
శ్రీనాథుఁడవు నీవే శ్రీవేంకటేశ్వర
నీ నాటకములోనే నిత్యులైరి చాలదా