పుట:తాళ్ళపాక పదసాహిత్యం - మూడవ భాగం.pdf/579

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0299-06 సాళంగనాట సం: 03-577 కృష్ణ

పల్లవి:

ముద్దుగారే యశోద ముంగిటి ముత్యము వీఁడు
తిద్దరాని మహిమల దేవకిసుతుఁడు

చ. 1:

అంతనింత గొల్లెతల అరచేతి మాణికము
పంతమాడే కంసుని పాలి వజ్రము
కాంతుల మూఁడులోకాల గరుడపచ్చఁబూస
చెంతల మాలోనున్న చిన్నికృష్ణుఁడు

చ. 2:

రతికేలి రుక్మిణికి రంగు మోవి పగడము
మితి గోవర్ధనపు గోమేధికము
సతమై శంఖచక్రాల సందుల వైడూర్యము
గతియై మమ్ముఁ గాచేటి కమలాక్షుఁడు

చ. 3:

కాళింగుని తలల పైఁ గప్పిన పుష్యరాగము
యేలేటి శ్రీవేంకటాద్రి యింద్రనీలము
పాలజలనిధిలోనఁ బాయని దివ్యరత్నము
బాలుని వలెఁ దిరిగీఁ బద్మనాభుఁడు