పుట:తాళ్ళపాక పదసాహిత్యం - మూడవ భాగం.pdf/567

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


రేకు: 0297-06 శంకరాభరణం సం: 03-565 మాయ

పల్లవి:

వేదము దీర్చదు వేరే శాస్త్రములు
యేదియుఁ దీర్చదు యిది నీమాయ

చ. 1:

నీ వల్ల బ్రదికిరి నిండు దేవతలు
నీవల్ల నసురలు నెఱిఁ జెడిరి
ఆవల నిందరి కాత్మవు నీవే
చేవదేరె నీ చిక్కులే భువిని

చ. 2:

నెమ్మిఁ బాండవుల నీవారంటివి
కమ్మర విడిచితి కౌరవుల
యిమ్ముల నీవావి యిద్దరికొకటే
తెమ్మలాయ నీ తీరని చిక్కు

చ. 3:

జగమున నీదే స్వతంత్రమెల్లా
నెగడిన జీవులు నీవారు
తగు శ్రీవేంకటదయివమ యిన్నియు
తెగి నీదాసులు తెలిసిన చిక్కు